Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆమ్రపాలి క్యాడర్ వివాదం.. హైకోర్టులో తీర్పు రిజర్వ్

Amrapali cadre dispute High Court reserves verdict
Advertisement
  • ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వ్
  • తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలు
  • క్యాట్ తీర్పుపై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేసిన ఆమ్రపాలి
  • ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పుపై సర్వత్రా ఆసక్తి
Advertisement
సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటా క్యాడర్ కేటాయింపు వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. రెండు వారాల్లో నిర్ణయం వెలువరిస్తామని ధర్మాసనం తెలిపినట్లు సమాచారం.

రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె న్యాయపోరాటం ప్రారంభించారు. 2016లో క్యాట్ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయగా, కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం 2024 జనవరిలో అధికారుల అభ్యర్థనలను పునఃపరిశీలించాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

అయితే, పునఃపరిశీలన అనంతరం 2024 అక్టోబర్ 9న కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆమ్రపాలి అభ్యర్థనను తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో విధులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఆమె మరోసారి క్యాట్‌ను ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన క్యాట్ 2025 జూన్ 24న ఆమ్రపాలికి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యాడర్ కేటాయింపు ప్రక్రియలో నిబంధనలను అమలు చేసిన తీరును తప్పుబడుతూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆమెను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించినట్లు పరిగణిస్తూ తగిన ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది.

అయితే, క్యాట్ తీర్పును కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై 2025 డిసెంబర్ 8న విచారణ జరిపిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వుల అమలుపై మధ్యంతర స్టే విధించింది.

ఈ స్టేను ఎత్తివేయాలని ఆమ్రపాలి దాఖలు చేసిన దరఖాస్తుపై తాజాగా విచారణ జరిగింది. ఆమె తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజన సమయంలో అధికారులను ఇన్‌సైడర్, ఔట్‌సైడర్ కేటగిరీలుగా వర్గీకరించిన విధానంలో లోపాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దీని కారణంగా తెలంగాణకు రావాల్సిన జనరల్ కేటగిరీ ఇన్‌సైడర్ పోస్టు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడిందని వాదించారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ ఈ వాదనలను వ్యతిరేకించారు. 2014 నాటి క్యాడర్ వర్గీకరణ ప్రక్రియను ప్రస్తుత వ్యాజ్యంలో నేరుగా సవాలు చేయలేదని, ఆ అంశానికి తాజా ఉత్తర్వులతో సంబంధం లేదని వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర స్టే ఎత్తివేతకు సంబంధించిన దరఖాస్తుపై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఈ నిర్ణయం ఆధారంగా క్యాట్ తీర్పు అమలుపై తదుపరి పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన రిట్ పిటిషన్‌పై తుది నిర్ణయం వేరుగా వెలువడాల్సి ఉంది.
Advertisement
Advertisement
Amrapali
IAS Amrapali cadre case
Telangana High Court
Andhra Pradesh cadre allocation
Central Administrative Tribunal CAT

More Telugu News